రేవంత్‌రెడ్డి సీఎం వ్యాఖ్యలపై స్పందించిన సీతక్క

అవసరమైతే సీతక్క సీఎం అవుతుందన్నారే కానీ, చేస్తామనలేదన్న సీతక్క

seethakka

హైదరాబాద్‌ః తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే అవసరమైతే సీతక్కను సీఎంను చేస్తామన్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. రేవంత్ అలా అనడాన్ని సీనియర్ నేతలు తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి సీతక్క కూడా స్పందించారు. రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టాల్సిన అవసరం లేదని, ఆ సమయంలో తాను పక్కనే ఉండడంతోనే తనను చూపించి చెప్పారని, తాను కాకుండా మరొకరు ఉన్నా ఆయన అదే చెప్పేవారని అన్నారు. పార్టీలో అన్ని వర్గాలకు సమాన న్యాయం ఉంటుందని చెప్పేందుకే రేవంత్ అలా అన్నారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ తమ పార్టీ బీసీలను సీఎం చేసిన విషయాన్ని సీతక్క గుర్తు చేశారు.

తమ అంతిమ లక్ష్యం పార్టీ అధికారంలోకి రావడమేనని, పార్టీ నిర్ణయించినవారే సీఎం అవుతారని స్పష్టం చేశారు. ఎవరు సీఎం అయినా అందరం కలిసే పనిచేస్తామన్నారు. దీనిని వివాదం చేయడం తగదని అన్నారు. ఎవరినో తగ్గించి, మరెవరినో పెంచాలన్న ఉద్దేశం రేవంత్‌లో లేదన్నారు. ఆ రోజు తానా సభల్లో రేవంత్‌ను ప్రశ్న అడిగిన వ్యక్తి ఎస్టీ అని, ఆ సమయంలో తాను పక్కనే ఉండడంతోనే తనను చూపించి రేవంత్ అలా అన్నారని సీతక్క అన్నారు. సీతక్క అవుతుందని రేవంత్ అన్నారు తప్పితే చేస్తానని అనలేదని, కావాలనే కొందరు రాద్ధాంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివాదాలు కట్టిపెట్టి కలసి పనిచేద్దామని నేతలకు సూచించారు.