సల్మాన్‌ను చంపేస్తానని బెదిరించిన యువకుడు అరెస్ట్

సల్మాన్‌ను చంపేస్తానని బెదిరించిన యువకుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు గత కొంతకాలంగా అనేక రకాలుగా హెచ్చరికలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సల్మాన్ కు చంపేస్తా అంటూ ఓ బెదిరింపు కాల్ వచ్చింది. సోమవారం రాత్రి ఓ వ్యక్తి ఏకంగా ముంబై పోలీస్ కంట్రోల్‌ రూమ్‌ కి ఫోన్ చేసి సల్మాన్‌ను చంపేస్తానని బెదిరించాడు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి జోధ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన రోకీ భాయ్ అని, తాను గో రక్షకుడిని అని పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

దీనిపై నిఘా పెట్టిన పోలీసులు..బెదిరించిన యువకుడిని పట్టుకోవడానికి పోలీసులు చేపట్టిన ఆపరేషన్ సుమారు తొమ్మది గంటల పాటు సాగింది. ఆ వ్యక్తిని సుమారు 10 కిలోమీటర్లు వెంబడించిన సిటీ క్రైమ్ బ్రాంచ్ మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకుంది. సల్మాన్ ఖాన్ కు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి 16 ఏళ్ల బాలుడు.. తొమ్మిదవ తరగతి చదువుతూ మధ్యలో మానేసిన ఈ బాలుడు రాజస్థాన్‌కు చెందినవాడు. ప్రస్తుతం పోలీసులు ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ప్రస్తుతం సల్మాన్ తన కొత్త సినిమా ‘కిసీ కా భాయ్, కిసీ కి జాన్’ ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ లో పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతి బాబు విలన్ గా నటిస్తున్నాడు. వెంకటేష్ పూజా హగ్దే కు అన్నయ్య పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.