రెండో రోజు ముగిసిన సోనియా ఈడీ విచారణ

నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) అధికారులు మంగళవారం ఆరు గంటలపాటు విచారించారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసిన ఈడీ.. రేపు కూడా విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఉదయం 11గంటలకు దర్యాప్తు సంస్థ విచారణను ప్రారంభించింది. మధ్యలో పలుసార్లు బ్రేక్ నిస్తూ.. సాయంత్రం 6గంటల వరకు విచారణ కొనసాగింది.

రెండో రోజు విచారణలో భాగంగా ఉదయం 11గంటలకు సోనియా తన కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకునేందుకు కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుందంటూ నిరసనగా రాహుల్ గాంధీ పార్లమెంటు నుండి రాష్ట్రపతి భవన్ వరకు కాంగ్రెస్ ఎంపీలతో కలిసి మార్చ్‌ నిర్వహించారు. ప్రియాంక గాంధీ తన తల్లికి వైద్య సహాయం అవసరమైతే మందులతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలోని మరొక గదిలో కూర్చున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.

రెండు రోజుల విచారణలో భాగంగా సోనియాను 55 ప్రశ్నలు అడిగినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. రాహుల్ గాంధీని అడిగినటువంటి ప్రశ్నలనే సోనియాను అడిగినట్లు పేర్కొన్నాయి. ఈనెల 21న ఈ కేసుకు సంబంధించి తొలిసారి సోనియాను ప్రశ్నించిన అధికారులు… గత శుక్రవారం మళ్లీ సమన్లు జారీ చేశారు. సోమవారం విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. సోనియా విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.