తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రావాల్సిందిగా కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి లేఖ

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వాన లేఖ పంపారు. వ్యక్తిగత ఆహ్వాన లేఖ, ఆహ్వాన పత్రిక ను స్వయంగా కేసీఆర్ కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్ కు, డైరెక్టర్ అరవింద్ సింగ్ కు సీఎం సూచించారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది.

అయితే, ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఉద్యమకారులతో సహా రాష్ట్రంలోని ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానం పంపిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కూడా ఆహ్వానం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2వ తేదీన ఉదయం 10 గంగలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలని కేసీఆర్‌కు పంపే ఆహ్వానంలో పేర్కొన్నారు. కేసీఆర్‌ను స్వయంగా కలిసి ఆహ్వానించాలని సీఎం రేవంత్ సూచించారు.