వరంగల్ బహిరంగ సభలో బిఆర్ఎస్ – కాంగ్రెస్ లఫై పవన్ కళ్యాణ్ ఫైర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ …బిజెపి తో కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 8 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా..మిగతా స్థానాల్లో బిజెపి కి సపోర్ట్ ఇస్తుంది. ఈ తరుణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ బుధువారం వరంగల్ లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ బిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. నా పోరాటానికి తెలంగాణ యువత అండగా ఉంటోందని అన్నారు. ఆంధ్రాలో ఎలా తిరుగుతున్నానో తెలంగాణలో కూడా అలాగే తిరుగుతాను స్పష్టం చేశారు. ఏ మార్పు కోసం తెలంగాణ బిడ్డలు చనిపోయారో అది సాధిస్తా అని అన్నారు.

తెలంగాణలో అవినీతి ఏ స్థాయిలో ఉందో మీకు బాగా తెలుసు, బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రంలో ఇంత అవినీతి జరగడం దారుణమన్నారు.మొన్ననే పార్టీ మారిన ఒక నాయకుడు బహిరంగంగానే మాట్లాడుతూ తెలంగాణలో 6% నుంచి 8% పర్సంటేజ్ ఇస్తున్నామని నాయకుడు చెప్పడం బాధాకరమని అన్నారు. తెలంగాణ గురించి మాట్లాడితే నా రోమం రోమం నిక్కబడుతుంది, నాలో గుండె ధైర్యం పెరుగుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే తెలంగాణకు మద్దతు ఇచ్చానని చెప్పారు. ఏపీలో రౌడీలు రాజ్యమేలుతున్నా, గుండాలు బెదిరిస్తున్నా, డబ్బు లేకపోయినా అంతమందిని తట్టుకొని నిలబడుతున్నానంటే, ఏ బలం లేకపోయినా గుండె ధైర్యంతో పోరాటం చేసే స్పూర్తిని తెలంగాణ నుంచే నేర్చుకుంటున్నాను… నా పోరాటానికి తెలంగాణ యువత అండగా ఉంటుందన్నారు. తెలంగాణ అమరవీరులు, పోరాట యోధుల మీద గౌరవం, నాలుగు కోట్ల ప్రజల మీద గౌరవంతో దశాబ్ద కాలం పాటు నోరు విప్పలేదన్నారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే ప్రధానమంత్రికి, దేశ ఆర్థిక శక్తిని 10వ స్థానానికి తీసుకెళ్లిన ప్రధానమంత్రి పై నాకు ఆపార గౌరవమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రాలో అధికార పార్టీల ప్రశ్నిస్తున్న వాణ్ణి తెలంగాణలో మార్పు కోరుకుంటానన్నారు. బీసీలు ముఖ్యమంత్రి కావాలని కోరారు. బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో తాను ఒక్కడినన్నారు. నాడు తెలంగాణకు మద్దతు ఇచ్చినవారిలో తాను ఒకడిని అని అన్నారు. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయాం అని అన్నారు.