పార్టీ కార్యకర్తలకు రేవంత్‌ రెడ్డి హెచ్చరికలు

ధర్నాలు చేస్తే పార్టీ నుండి సస్పెన్షన్..రేవంత్

revanth-reddy-warning-to-congress-party-activists

హైదరాబాద్‌ః సొంత పార్టీ కార్యకర్తలకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శనివారం గట్టి హెచ్చరికలు జారీ చేశారు. గాంధీ భవన్ లో ఆందోళనలు చేస్తే తీవ్రచర్యలు ఉంటాయన్నారు. పార్టీ కార్యాలయం గాంధీ భవన్ మెట్లపై ఇక నుండి ధర్నాలు చేస్తే సస్పెండ్ చేస్తామన్నారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు చిన్నారెడ్డికి సూచించారు. నియామకంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకు రావాలని, వినతి పత్రం అందిస్తే చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతేకానీ ధర్నాలు చేస్తే ఊరుకోమన్నారు.

నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందంటూ గత కొన్నిరోజులుగా నాయకులు గాంధీ భవన్ ప్రాంగణంలో ఆందోళనలు చేస్తున్నారు. ఈ రోజు రేవంత్ వచ్చేసరికి కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆలేరు నియోజకవర్గం తురకపల్లికి చెందిన పలువురు నిరసన వ్యక్తం చేశారు. గాంధీ భవన్ లోనికి వెళ్లాక రేవంత్ వారి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆలేరు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు గాను ఏడు మండలాల అధ్యక్షులను నియోజకవర్గ ఇంఛార్జ్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అనుకూలంగా ఉన్నవారిని నియమించినట్లు తెలిపారు. ఒక్క మండలం మహిళకు ఇవ్వడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఆందోళన విరమించాలని లేదంటే.. వివరాలు సేకరించి సస్పెండ్ చేయాలని గాంధీ భవన్ ఇంఛార్జ్ ని ఆదేశించారు.