అవన్నీ పుకార్లే.. సోనియా గాంధీ నా పేరు సూచించలేదుః ఖర్గే

mallikarjuna kharge
mallikarjuna kharge

న్యూఢిల్లీః కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అధిష్టానం తరపు అభ్యర్థి తానేనంటూ వస్తున్న వార్తలను పార్టీ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం సోనియా గాంధీ ఏనాడు తన పేరును ప్రతిపాదించలేదని మల్లిఖార్జున్ ఖర్గే చెప్పారు. గాంధీ కుటుంబం నుంచి ఎవరు ఎన్నికల్లో పోటీ చేయరని.. ఎవరికి మద్ధతు కూడా ఇవ్వబోమని సోనియా స్పష్టం చేశారని అన్నారు. సోనియాను, తనను కించపరిచేందుకే కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పుకార్లు పుట్టించారని ఆరోపించారు.

యూపీలో పర్యటిస్తున్న ఖర్గే..పార్టీలో సమిష్టి నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. పోటీ అన్నది సహజమేనని.. శశి థరూర్ తనకు సోదరుడిలాంటి వారన్నారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ఉదయ్పూర్ డిక్లరేషన్ను పక్కాగా అమలుచేస్తానని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్ష పోరులో ఖర్గే, శశిథరూర్ ఉన్నారు. ఇద్దరు పలు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ లోని 9300 మంది వీరిలో ఒకరిని పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నుకోనున్నారు. అక్టోబర్ 17న అధ్యక్ష ఎన్నిక జరగనుండగా.. 19న ఫలితం రానుంది. కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ముందుగా అశోక్ గెహ్లాట్ పేరు వినిపించినా.. పలు కారణాలతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఖర్గే బరిలో నిలవడంతో ఆయనకు మద్ధతుగా దిగ్విజయ్ సింగ్ పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఖర్గే, థరూర్ మాత్రమే బరిలో నిలిచారు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/