జగన్ సినిమా అయిపోయింది – చంద్రబాబు

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టిడిపి ఈసారి జనసేనతో పొత్తు పెట్టుకుని జగన్ ఓడించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే జనసేనతో సంబంధించిన పొత్తులు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాల గురించి చర్చలు పూర్తయ్యాయి. మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో టిడిపి అధినేత చంద్రబాబు తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. ‘రా కదలిరా’ పేరుతో నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. అలాగే టిడిపి అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ప్రజలకు వివరిస్తూ.. కీలక హామీలను చంద్రబాబు ప్రకటిస్తూ అధికార పార్టీకి చెమటలు పట్టిస్తున్నారు.

తాజాగా ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో జరిగిన రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు సీఎం జగన్ పై నిప్పులు జరిగారు. జగన్ టైం ముగిసిందని, అమరావతి మన రాజధాని అని రాసి పెట్టుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గత ఐదు ఏళ్ళుగా ఏపీకి రాజధాని లేకుండా జగన్ చేశాడని, బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపేసి నారా రక్త చరిత్ర అంటూ తప్పుడు రాతలు రాశారు. వైఎస్ఆర్ మరణానికి రిలయన్స్ అధినేత కారణం అంటూ రిలయన్స్ మాల్స్ పై జగన్ రెడ్డి దాడులు చేయించాడని, ముకేశ్ అంబానీ ఏపీకి వస్తే ఆహ్వానించడాన్ని జగన్ ఫై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

మూడు నెలల్లో జగన్ ప్రభుత్వం క్లీన్ బోల్డ్ అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జగనన్న వదిలిన బాణం షర్మిల ఇప్పుడు జగన్ వైపు తిరిగిందని, అసమర్థ అవినీతి మంత్రులతో జగన్ క్యాబినెట్ నిండిపోయిందని వైసీపీలో బూతురత్నాలకు , బూతు సామ్రాట్లకు ఎమ్మెల్యే టికెట్లు మంత్రి పదవులు దక్కాయి అంటూ సెటైర్లు వేశారు. ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి జగన్ రెడ్డి సాక్షాత్తు మెడలు వంచి దండాలు పెట్టాడు. మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక బూమ్ బూమ్ వంటి నాసిరకం మద్యం తెచ్చి రేట్లు పెంచి దోచుకుంటున్నాడని చంద్రబాబు ఫైర్ అయ్యారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తానని , డీఎస్సీ ఏస్తానని, జాబ్ క్యాలెండర్ ఇస్తానని మాయమాటలు చెప్పి అందరిని మోసం చేశారని చంద్రబాబు ఆరోపించారు.