దత్తత పేరుతో కేటీఆర్ నాటకాలు ఆడుతున్నాడంటూ రేవంత్ ఫైర్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక వేడి నడుస్తుంది. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని అధికార పార్టీ బీ(టి)ఆర్ఎస్ తో పాటు బిజెపి , కాంగ్రెస్ పార్టీ లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రచారంలో పార్టీ నేతలంతా పాల్గొని , ప్రతి ఇంటి తలుపు తడుతూ ఓటు అడుగుతున్నారు. గురువారం టిఆర్ఎస్ అభ్యర్థి గా ప్రభాకర్ నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మునుగోడు ప్రజల ఫై అనేక హామీలు కురిపించారు.

మునుగోడు నియోజ‌క‌వ‌ర్గాన్ని ద‌త్త‌త తీసుకుంటాన‌ని ప్రకటించారు. న‌వంబ‌ర్ 6 త‌ర్వాత ప్ర‌తి మూడు నెల‌ల‌కొక‌సారి వ‌చ్చి అభివృద్ధి ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తానని , అభివృద్ధిలో అండ‌గా ఉంటానని , రోడ్ల‌ను అభివృద్ధి చేస్తానని హామీఇచ్చారు. నా మాట మీద విశ్వాసం ఉంచండి. త‌ప్ప‌కుండా అభివృద్ధిలో ప‌య‌నిద్దాం. మునుగోడును అభివృద్ధిలో ముందంజ‌లో ఉంచేందుకు కృషి చేద్దామ‌ని అన్నారు. కాగా కేటీఆర్ హామీల ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ విమర్శలు కురిపించారు.

మంత్రి కేటీఆర్ దత్తత పేరుతో కొడంగల్ ప్రజలను మోసం చేశాడని.. ఇప్పుడు మునుగోడుకు వచ్చి అవే మాయ మాటలు చెబుతున్నాడని మండిపడ్డారు. చిన్న మూల్కనూరు, మూడు చింతలపల్లి, లక్ష్మాపూర్ ను కెసిఆర్ దత్తత తీసుకొని ఏమి చేయలేదని మండిపడ్డారు. రేపో మాపో సీఎం కేసీఆర్ మునుగోడు కు వస్తారని.. కుర్చీ వేసుకుని కూర్చుని మునుగోడుకు సముద్రం తెస్తానని చెబుతారని ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత కెసిఆర్ మళ్ళీ ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారని వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్, బిజెపి పార్టీలు కలిసి కాంగ్రెస్ ను అంతం చేయాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాయని ఆరోపించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధన దాహం, కాంట్రాక్టుల కోసమే ఈ ఉప ఎన్నిక వచ్చిందని విమర్శించారు.