కంటతడి పెట్టిన పాల్వాయి స్రవంతి

మునుగోడు ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ అభ్యర్థి గా బరిలోకి దిగిన పాల్వాయి స్రవంతి..శుక్రవారం నామినేషన్ దాఖలు చేసారు. అనంతరం మాట్లాడుతూ తన తండ్రిని గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. తండ్రిని గుర్తు తెచ్చుకుంటూ.. ఈరోజు నాన్నలేని లోటు నాకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్న మీరందరూ నా తోబుట్టువులై, నా తండ్రిస్థానం తీసుకుని, నాతోపాటు నడవాలని నా చేతులు చాచి, నా కొంగు చాచి ప్రాదేయపడుతున్నాను. మీ ఒక్క ఓటు, మీ ఒక్కటే ఒక్క ఓటు ఈసారి ఈ ఎన్నికల్లో నాకే వెయ్యాలని కోరుతున్నా అంటూ గద్గదస్వరంతో మాట్లాడటం అక్కడికి వచ్చిన ప్రజల గుండెను తడిమింది.

ఇక శుక్రవారంతో మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ పర్వం ముగిసింది. టీఆర్‌ఎస్ పార్టీ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో నిల్చున్నారు. ప్రధానంగా ఈ ఉప ఎన్నిక పోటీ ఈ ముగ్గురి మధ్య ఉండనుంది. ఈ ఉప ఎన్నిక లో మొత్తం వందకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం ఒక్కరోజే 50కి పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. రేపు, ఎల్లుండి నామినేషన్ల పరిశీలన జరగనుంది. అక్టోబర్ 17 న నామినేషన్ల ఉపసంహరణ. నవంబర్ 3న పోలింగ్‌ నిర్వహించనున్నారు. 6న ఓట్ల లెక్కించి, ఫలితాలను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అన్ని పార్టీల నేతలు తమ ప్రచారం తో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.