వైస్సార్ లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్ అవార్డ్స్ ప్రకటన

రెండో ఏడాది వైస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్, వైస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డుల‌ను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం అవార్డు గ్రహీత‌ల పేర్ల‌ను వెల్లడించింది. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన కేటగిరీలకు అవార్డుల్లో ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2022 నవంబరు 1న, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా.. ఈ అవార్డుల‌ను ప్ర‌దానం చేయ‌నున్నారు. వైస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ.10 లక్షల నగదు, వైస్సార్ కాంస్య ప్రతిమ, మెడల్ (జ్ఞాపిక), శాలువ బహుకరిస్తారు. వైస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ. 5 లక్షల నగదు, వైస్సార్ కాంస్య ప్రతిమ, మెడల్ (జ్ఞాపిక), శాలువ బహుకరిస్తారు.

క‌ళ‌లు- సంస్కృతి విభాగంలో క‌ళాత‌ప‌స్వి, సినీ ద‌ర్శ‌కుడు కె.విశ్వ‌నాథ్‌తో పాటు న‌టుడు ఆర్‌.నారాయ‌ణ మూర్తికి వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్ మెంట్ అవార్డుల‌ను ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. ఇక ఇదే రంగంలో రంగ‌స్థ‌ల క‌ళాకారుడు నాయుడు గోపి, క‌ళంకారి నేత‌న్న పిచుక శ్రీనివాస్‌, షేక్ గౌసియా బేగంలను వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుల‌కు ఎంపిక చేశామ‌ని తెలిపింది.

సాహిత్య సేవా విభాగంలో విశాలాంధ్ర ప‌బ్లిషింగ్ హౌస్‌, ఎమెస్కో ప్ర‌చుర‌ణాల‌యం, ర‌చ‌యిత శాంతి నారాయ‌ణ‌ల‌కు వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు ద‌క్కాయి. వ్య‌వ‌సాయ విభాగంలో ఆదివాసీ కేష్యూన‌ట్స్ ఫార్మ‌ర్స్ ప్రొడ్యూస‌ర్స్ కంపెనీకి చెందిన సోడెం ముక్క‌య్య‌, కుశ‌ల‌వ కోకోన‌ట్ ఫార్మ‌ర్స్ ప్రొడ్యూస‌ర్స్ కంపెనీకి చెందిన గోపాల‌కృష్ణ‌, అన్న‌మయ్య మూచువ‌ల్లీ ఎయిడెడ్ కో ఆప‌రేటివ్ సొసైటీ లిమిటెడ్‌కు చెందిన జ‌య‌బ్బ‌నాయుడు, అమృత ఫ‌ల ఫార్మ‌ర్స్ ప్రొడ్యూస‌ర్స్ కంపెనీకి చెందిన మౌక్తిక‌, క‌ట్ట‌మంచి బాల‌కృష్ణారెడ్డిలు వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుల‌కు ఎంపిక‌య్యారు.

మ‌హిళా సాధికారత‌, ర‌క్ష‌ణ విభాగం కింద ప్ర‌జ్వ‌లా ఫౌండేష‌న్‌కు చెందిన సునీతా కృష్ణ‌న్‌తో పాటు శిరీష రీహాబిలిటేష‌న్ సెంట‌ర్‌, దిశ పోలీసింగ్‌లను వైఎస్సార్‌ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంపిక చేసింది. దిశ పోలీసింగ్‌లో ఫిర్యాదు అందిన నిమిషాల్లో స్పందించిన ఐదుగురు పోలీసుల‌కు అచీవ్‌మెంట్ అవార్డులు ద‌క్కాయి.