రాజశేఖర్ కు కేటీఆర్ పీఏతో సంబంధం ఉందన్న రేవంత్

TSPSC పేపర్ లీక్ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటన పట్ల ప్రతిపక్షపార్టీలు నిరసనలు , ఆందోళనలు చేపడుతున్నారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి ఆందోళనలు చేపట్టగా..ఈరోజు ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేసింది. వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ ముందు కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.హైదరాబాద్ బీజాపూర్ హైవేపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కేటీఆర్ ను మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయాలంటూ..విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు.

ఈ లీకేజ్ ఫై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. లీకేజి వ్యవహారం మొత్తం మంత్రి కేటీఆర్ ఆఫీసు నుంచే నడిచిందని ఆరోపించారు. గ్రూప్-1 లీకేజిలో కేటీఆర్ పీఏది కీలక పాత్ర అని, లీకేజి కేసులో నిందితుడు రాజశేఖర్ రెడ్డికి, కేటీఆర్ పీఏకి సంబంధం ఉందని తెలిపారు. ఇద్దరివీ పక్క పక్క గ్రామాలేనని రేవంత్ రెడ్డి వివరించారు. పీఏ చెబితేనే రాజశేఖర్ రెడ్డికి కేటీఆర్ ఉద్యోగమిచ్చారని తెలిపారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ లో 100 మార్కులు దాటిన వారిని విచారించాలని డిమాండ్ చేశారు. 2016లో జరిగిన గ్రూప్-1 పరీక్షలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని, అమెరికా నుంచి నేరుగా వచ్చిన అమ్మాయి గ్రూప్-1 రాస్తే ఆ అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ పరీక్షలో టీఎస్ పీఎస్సీ ఉద్యోగికి 4వ ర్యాంక్ వచ్చిందని అన్నారు. వారిద్దరూ ఉద్యోగాలు పొందడం వెనుక ఎవరున్నారో తేలాలని డిమాండ్ చేశారు.