ఐప్యాక్ టీంపై సీఎం జగన్ ఆగ్రహం..

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీ వైస్సార్సీపీ కి భారీ షాక్ ఇచ్చింది. రాబోయే ఎన్నికల్లో 175 కు `175 సాధిస్తామని ధీమాగా ఉన్న పార్టీ కి ఈ ఫలితాలు పెద్ద షాక్ ఇచ్చాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ లెక్క తప్పిందని సీఎం జగన్ తో పాటు నేతలంతా తలలు పట్టుకుంటున్నారు. బయటకు కవర్ చేసుకుంటున్నప్పటికీ లోలోపల మాత్రం ఎంతో బాధపడుతున్నారు. అంచనా ఎక్కడ తప్పిందో అని లెక్కలేసుకుంటున్నారు. గత ఎన్నికల నుంచి ఐప్యాక్ టీం వ్యహకర్తగా పనిచేస్తోంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐప్యాక్ వ్యూహాలు బెడిసికొట్టాయి అని , ఐప్యాక్ ఒక చోట టార్గెట్ చేస్తే దెబ్బ మరోచోట పడిందని చెబుతున్నారు. టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారని భావించారు, యువత తమవైపు ఉంటుందని ఊహల్లో తేలిపోయారు. కానీ ఫలితం మరోలా రావడం తో సీఎం జగన్ సైతం ఆగ్రహం గా ఉన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాలు తప్పితే, వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తారని మండిపడ్డారట. ఇంత చిన్న ఎన్నికను కూడా మేనేజ్ చేయలేకపోతే మీ వ్యూహాలు ఎందుకని ఆయన ఐప్యాక్ టీమ్ ను నిలదీసినట్లు తెలుస్తోంది. కోట్లకు కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నప్పుడు..ఎందుకు పనిచేయలేకపోయారని జగన్ నిలదీస్తుంటే ఐప్యాక్ టీం దగ్గర సమాధానం లేకపోయిందట. వచ్చే ఎన్నికల్లో తాను టార్గెట్ 175 ఫిక్స్ చేసుకున్నానని…ఇలాగైతే వేరే దారి చూసుకోవాల్సి వస్తుందని ఐప్యాక్ కు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

మరోపక్క ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందడం తో ఆ పార్టీ నేతలు , కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పశ్చిమ రాయలసీమ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి భూమి రెడ్డి రామగోపాలరెడ్డి వైస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై 7543 ఓట్ల తేడాతో గెలిచారు. ఉత్తరాంధ్రలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు ఘన విజయం సాధించగా, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ గెలిచారు.