‘తెలంగాణ జన గర్జన’ బీఆర్ఎస్ వెన్నులో వణుకుపుట్టిస్తోంది – రేవంత్

మరికాసేపట్లో ఖమ్మం లో ‘తెలంగాణ జన గర్జన’ సభ మొదలుకాబోతుంది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ తో పాటు పలువురు నేతలు హాజరుకాబోతున్నారు. దాదాపు వంద ఎకరాల్లో ఈ సభ నిర్వహిస్తున్నారు. ప్రజలు సైతం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అయితే మార్గమధ్యలో పోలీసులు వాహనాలను తనిఖీ చేయడం..సీజ్ చేయడం పట్ల కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభకు వచ్చే అశేష జనవాహినికి ట్రాన్స్ పోర్టు అడ్డంకులు సృష్టించి, సంక్షేమం కట్ చేస్తామని బెదిరించి ప్రభంజనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

అర చెయ్యిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపలేరన్న సత్యాన్ని ప్రభుత్వం గ్రహిస్తే మంచిది. అధికారులు పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అలాగే పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే సీతక్క ఫైర్‌ అయ్యారు. ప్రజల కోసం ప్రజా సమస్యల మీద దేశం కోసం పోరాడుతున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ అని… తెలంగాణ ఇచ్చిన పార్టీ అధినేతగా తమ నాయకుడు మొదటిసారి ఖమ్మం జిల్లాలోకి అడుగు పెడుతుంటే, బిఆర్ఎస్ నాయకులు తట్టుకోలేక ఎక్కడికక్కడ నిర్బంధంతో చెక్ పోస్ట్ లు పెట్టి నిర్భందిస్తున్నారని ఆగ్రహించారు.