భారీగా కరోనా కేసులు..మహారాష్ట్రకు కేంద్ర ప్రభుత్వం లేఖ

గత ఆగస్టు, సెప్టెంబర్ లో తీసుకున్న విధంగా కఠిన చర్యలు తీసుకోండి

ముంబై: గత కొన్ని రోజులుగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో అయితే ఆందోళనకర స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా కేంద్రం సంచలన విషయాన్ని వెల్లడించింది. మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందని… అది ప్రస్తుతం ప్రారంభ దశలో ఉందని పేర్కొంది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు.

మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభ దశలో ఉందని… ఈ నేపథ్యంలో కంటైన్మెంట్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని లేఖలో మహా ప్రభుత్వాన్ని రాజేశ్ భూషణ్ హెచ్చరించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనాను గుర్తించడం, టెస్టింగ్, ఐసొలేషన్ (ట్రాక్, టెస్ట్, ఐసొలేట్) వంటి చర్యలను కట్టుదిట్టంగా చేపట్టడం లేదని ఆయన అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా కరోనా విస్తరిస్తోందని… అయితే, దీనికి తగ్గట్టుగా గట్టి చర్యలను తీసుకోవడం లేదని పేర్కొన్నారు. 2020 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్నారో… ఇప్పుడు మళ్లీ అలాంటి చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. కరోనా కట్టడికి కోవిడ్ నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/