TSRTC మరో బాదుడు..ప్రయాణికుల జేబులు మరింత ఖాళీ

ఇప్పటికే టిఎస్ఆర్టీసీ ప్రయాణికులపై పలు రకాల సెస్ ల పేరుతో టికెట్ చార్జీలను భారీగా వసూళ్లు చేస్తుండగా..ఇప్పుడు మరోసారి వారిపై భారం మోపేందుకు సిద్ధమైంది. తాజాగా లగేజీ చార్జీల రూపంలో జులై 22 నుండి ప్రయాణికుల జేబులు ఖాళీ చేయబోతుంది. 50 కిలోల వరకు ఉచిత లగేజీకి అవకాశం ఇస్తున్నప్పటికీ..ఇకపై అదనపు లగేజీ భారం కానుంది. అదనంగా ఒక కిలో పెరిగినా పాతిక కేజీల వరకు ఒక యూనిట్‌గా పరిగణించి పూర్తి చార్జీని వసూలు చేయబోతుంది.

ప్రతి యూనిట్‌కు ఇప్పటివరకు పల్లెవెలుగు బస్సుల్లో 25 కిలోమీటర్ల దూరం వరకు రూ. 1 ఛార్జీ వసూలు చేసిన ఆర్టీసీ.. ఈ నెల 22 నుంచి ఆ చార్జీ రూ. 20కి పెంచింది. 26 – 50 కిలోమీటర్ల మధ్య లగేజీ ఛార్జీ ప్రతి యూనిట్‌కు ఇంతకుముందు రూ.2గా ఉండగా రూ. 40కి పెంచింది. 51-75 కి.మీ. మధ్య రూ.3 నుంచి రూ.60కి, 76 – 100 కి.మీ మధ్య రూ. 4 నుంచి రూ.70కి పెరిగింది. డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో లగేజీ చార్జీలు పెంచాల్సి వచ్చిందని ఆర్టీసీ అధికారులు చెప్పుకొచ్చారు.

ఆర్టీసీ బస్సుల్లో ట్రక్కు టైర్లు తరలించాలంటే ఇకపై 3యూనిట్లుగా పరిగణించి ఛార్జీలు వసూలు చేయనున్నారు. టీవీ, ఫ్రిజ్‌, సైకిల్‌, ఫిలింబాక్సులు, వాషింగ్‌ మెషీన్‌, కార్‌ టైర్లను 2 యూనిట్లుగా, రేడియో, ఖాళీ బ్యాటరీ, టేబుల్‌ ఫ్యాన్‌, 25 లీటర్ల ఖాళీక్యాన్‌, కంప్యూటర్‌ మానిటర్‌, సీపీయూ, హార్మోనియం తదితరాలను ఒక యూనిట్‌గా పరిగణించబోతున్నారు.