మహారాష్ట్ర రాజకీయాలలో మరో కీలక పరిణామం..

మహారాష్ట్ర రాజకీయాలలో కీలక పరిమాణం చోటుచేసుకుంది. బాబాయి శరద్‌పవార్‌పై తిరుగుబాటు చేశారు అజిత్‌పవార్‌. 30 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే సర్కార్‌కు మద్దతు ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం తన వర్గం ఎమ్మల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన అజిత్‌ పవార్‌.. మహారాష్ట్రలోని ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించాడు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, కొంతమంది రాష్ట్ర మంత్రులు ఒకరి వెంట ఒకరు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అనంతరం అజిత్‌ పవార్‌ను రాష్ట్ర క్యాబినెట్‌లో చేర్చుకుని ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తున్నట్లు అక్కడికక్కడే ప్రకటించారు. అనంతరం మహారాష్ట్ర గవర్నర్‌ రమేశ్‌ బియాస్‌ అజిత్‌ పవార్‌ చేత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. పవార్‌తోపాటు ఆయన వర్గానికి చెందిన చగన్‌ భుజ్‌బల్‌, దిలీప్‌ వాల్సే పాటిల్‌ తదితరులు మంత్రులుగా ప్రమాణం చేశారు.

కొన్ని రోజుల క్రితమే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు జరిగిన విషయం తెలిలిసిందే. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ ను నియమించారు. ఆ పార్టీలో అజిత్ పవార్ ‭కు ప్రాధాన్యం లేకుండా పోయింది. అజిత్ పవార్‭ వ్యవహరిస్తోన్న తీరు వల్లే ఆయనను శరద్ పవార్ పక్కన పెట్టారన్న ప్రచారం జరిగింది. చివరకు అజిత్ పవార్.. బీజేపీ-శివసేన షిండే వర్గంతో చేతులు కలిపి వారిలో కలిసిపోయారు.