తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై రేణుకా చౌదరి ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో ప్రోటోకాల్ అమలు కావడం లేదని, గవర్నర్ పర్యటనకు కూడా సెక్యూరిటీ కల్పించడం లేదని రేణుకా చౌదరి అన్నారు. రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ప్రజల్ని పోలీసుల ఇబ్బందులు పెడుతుంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎందుకు సైటెంట్ ఉంటున్నారు.. వెంటనే స్పెషల్ టీంలను ఎందుకు పంపించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. వెంటనే కేంద్ర టీంలను పంపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని… వారి వల్ల కొంతమంది మంచి పోలీసులు కూడా పనిచేసే పరిస్థితి లేదంటూ వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి కేంద్రం ఫిర్యాదులను స్వీకరించాలని డిమాండ్ చేశారు.

‘‘నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు గవర్నర్‌ వెళ్తే కనీసం సెక్యూరిటీ కల్పించరా? ఐఏఎస్, ఐపీఎస్‌లకు రాజకీయాలతో ఏం సంబంధం? గవర్నర్ పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం అధికారులు హాజరు కావాలి. అయినా ఎందుకు రాలేదు? గవర్నర్ మహిళ అని కూడా చూడకుండా అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. ఇది పద్ధతి కాదు. ఇవి సంస్కారం ఉన్న వాళ్లు చేసే పనులు కావు. ఏ మహిళ గురించి, ఎవరు విమర్శలు చేసినా ఊరుకోము’’ అంటూ గవర్నర్ విషయంలో టీఆర్ఎస్‌ అనుసరిస్తున్న వైఖరిపై విమర్శించారు. బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కేసులో మంత్రి పువ్వాడ అజయ్‌పై చర్యలు తీసుకోకపోవడానికి కేటీఆరే కారణమని ఆమె అన్నారు.