ఛ‌లో ఢిల్లీ..జేసీబీల‌ను వెన‌క్కి తీసుకెళ్లండి…రైతుల్ని కోరిన హ‌ర్యానా పోలీసులు

‘Remove JCB machines from protest site or…’: Haryana cops warn excavator owners

న్యూఢిల్లీః ఛ‌లో ఢిల్లీ మార్చ్ మ‌ళ్లీ జోరందుకున్న‌ది. దేశ రాజ‌ధాని దిశ‌గా పంజాబీ రైతులు క‌దిలారు. మ‌రోవైపు ఢిల్లీలో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను పెంచారు. టిక్రి, సింఘూ, ఘాజిపూర్ బోర్డ‌ర్ పాయింట్ల వ‌ద్ద కూడా బందోబ‌స్తును పెంచేశారు. పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించే అంశంలో చ‌ట్టాన్ని త‌యారు చేయాల‌ని రైతులు డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం చేసిన ప్ర‌తిపాద‌న‌ను రైతు సంఘాలు వ్య‌తిరేకించాయి. ప‌ప్పుదినుసులు, మొక్క‌జొన్న‌లు, ప‌త్తి పంట‌ల‌కు అయిదేళ్ల వ‌ర‌కు ఎంఎస్పీ క‌ల్పిస్తామ‌న్న ప్ర‌భుత్వ ఆఫ‌ర్‌ను రైతులు తిర‌స్క‌రించారు.

ఛ‌లో ఢిల్లీ కోసం తీసుకువ‌చ్చిన జేసీబీల‌ను వెన‌క్కి తీసుకెళ్లాల‌ని హ‌ర్యానా పోలీసులు రైతుల్ని కోరారు. జేసీబీల‌ను తొల‌గించ‌ని ప‌క్షంలో వాటి ఓన‌ర్ల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు పోలీసులు చెప్పారు. పంజాబ్‌, హ‌ర్యానా బోర్డ‌ర్ పాయింట్ల వ‌ద్ద ఉంచిన జేసీబీల వ‌ల్ల సెక్యూర్టీ ద‌ళాలకు స‌మ‌స్య‌లు తలెత్తే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్రోక్లెయినర్లు, జేసీబీ ఓన‌ర్లు, ఆప‌రేట‌ర్ల‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నిర‌స‌న ప్ర‌దేశం నుంచి వాటిని విత్‌డ్రా చేసుకోవాల‌ని కోరారు. నాన్‌బెయిల‌బుల్ కేసు కింద‌కు వ‌స్తుంద‌ని, క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశాలు ఉన్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.