హుస్సేన్ సాగర తీరంలో 30 టన్నుల వ్యర్థాల తొలగింపు..!

Removal of 30 tons of waste on the coast of Hussain Sagar..!

హైదరాబాద్‌ః హైదరాబాద్‌లో వినాయక నిమజ్జం దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఇక జీహెచ్​ఎంసీ అధికారులు హుస్సేన్ సాగర్​ను క్లీన్ చేసే పనిలో పడ్డారు. గణేశ్ నిమజ్జనాల నేపథ్యంలో హుస్సేన్‌సాగర్లో భారీగా వ్యర్థాలు పేరుకుపోయాయి. గణపతి నిమజ్జనం దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో ఈ వ్యర్థాలను తొలగించే ప్రక్రియను అధికారులు ఈరోజు ప్రారంభించారు.

ఈరోజు ఉదయం నుంచి హుస్సేన్ సాగర తీరంలో ఉన్న వ్యర్థాలను క్రేన్లు, ప్రత్యేక వాహనాల సాయంతో తొలగిస్తున్నారు. ఆ వ్యర్థాలన్నింటిని ఎప్పటికప్పుడు వాహనాల్లో తరలిస్తున్నారు. ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్ మార్గ్‌, పీవీ నరసింహారావు మార్గ్‌లో విఘ్ననాథుడి నిమర్జనోత్సవం అనంతరం… పేరుకుపోయిన వ్యర్థాలను జీహెచ్​ఎంసీ కార్మికులు తొలగిస్తున్నారు. రోడ్లపై కూడా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. వ్యర్థాల తొలగింపుల్లో అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌, ఇనుము, చెక్కలు, కర్రలు బయట పడుతున్నాయి.

ఒక పక్క విగ్రహాలను నిమజ్జనం చేసిన వెంటనే వ్యర్థాల తొలగింపు పనులు, మరోపక్క రోడ్లపై స్వీపింగ్ యంత్రాల సాయంతో పారిశుద్ధ్య పనులను ఏకకాలంలో హెచ్​ఎండీఏ చేపట్టింది. దాదాపుగా ఈ ఏడాది హుస్సేన్ సాగర్​లో 30 టన్నుల వ్యర్థాలు పేరుకుపోయినట్లు అధికారులు అంచనాకు వచ్చారు. ఇప్పుడు వాటిని తొలగించే పనిలో బిజీ అయ్యారు.