మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి ముర్ము సంతకం

Women’s reservation bill signed into law by President Droupadi Murmu

న్యూఢిల్లీః మహిళా రిజర్వేషన్ బిల్లు ఎట్టకేలకు రాష్ట్రపతి ఆమోదం పొందింది. పార్లమెంట్‌ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడంతో బిల్లు చట్టరూపం దాల్చింది. లోక్‌సభ, శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లుకు ఇటీవలే పార్లమెంట్‌ ఉభయసభలు ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు తాజాగా రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇందుకు సంబంధించి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 106వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్ట సభల్లో మహిళలకు కేంద్రం 33శాతం రిజర్వేషన్లు కల్పించింది. అయితే జనాభా లెక్కల తర్వాత చేపట్టే డీలిమిటేషన్‌ అనంతరం మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ ద్వారా ఖరారు చేసే తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది.

మహిళా రిజర్వేషన్ల బిల్లును ‘నారీ శక్తి వందన్ అధినియమ్’గా అభివర్ణించిన విషయం తెలిసిందే. అధికారికంగా 106వ రాజ్యాంగ సవరణ బిల్లుగా దీన్ని వ్యవహరిస్తారు. రాష్ట్రపతి ఆమోదంతో ఇది ఇప్పుడు రాజ్యాంగ (106వ సవరణ) చట్టంగా మారింది. లోక్​సభలో ఈ బిల్లుకు ఇద్దరు ఎంఐఎం ఎంపీలు మినహా అందరూ మద్దతు పలికారు.