5జీ సర్వీసులను ప్రారంభించిన రిలయన్స్ జియో

రాజస్థాన్‌లో: ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సేవలను మరింతగా విస్తరించింది. రిలయన్స్ జియో సంస్థ రెండు నెలల క్రితం ప్రకటించినట్లుగానే ఈరోజు లాంఛనంగా 5జీ సర్వీసులను ప్రారంభించింది. రాజస్థాన్ రాష్ట్రం రాజ్‌సమంద్‌లోని ప్రతిష్ఠాత్మక శ్రీనాథ్‌జీ ఆలయంలో రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ చేతుల మీదుగా 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. దాంతో దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ ఏడాది పూర్తయ్యే లోపల దేశంలోని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై సహా ప్రధాన నగరాలన్నింటిలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రిలయన్స్ జియో కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇక 2023 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి పట్టణానికి, మండలానికి, తాలూకాకు 5జీ నెటవర్క్‌ను విస్తరించాలన్నది తమ ఉద్దేశమని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ గత ఆగస్టులో ప్రకటించారు. కాగా, రిలయన్స్ కంపెనీ 5జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం రెండు లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. 5జీ స్టాండలోన్ పేరుతో 5జీ తాజా వెర్షన్‌ను విస్తరించనున్నట్లు కంపెనీ తెలిపింది.