సిట్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్

పేపర్ లీకేజ్ ఘటన లో మంత్రి కేటీఆర్ దగ్గర ఉండే వ్యక్తుల పాత్ర ఉందనే ఆరోపణలు చేసిన క్రమంలో సిట్ అధికారులు బండి సంజయ్ కి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తమ వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలంటూ.. సిట్ అధికారులు బండి సంజయ్ కి నోటీసులు అందజేశారు. ఈ నోటీసులపై బండి సంజయ్ స్పందించారు. దొంగలను వదిలిపెట్టి ప్రతిపక్ష నేతలకు నోటీసులివ్వడమేంటి? అని ప్రశ్నించారు. ఈరోజు తానే సిట్ అధికారులను పిలిచానని, తాను ఇంట్లో లేని సమయం చూసి సిట్ వాళ్లు తమ ఇంటికొచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.

‘యువకులు కష్టపడి కోచింగ్ తీసుకుంటే వారి భవిష్యత్‌ను పేపర్ లీకేజీ వల్ల అంధకారంలో నెట్టారు. మంత్రి కేటీఆర్ దీనికి బాధ్యత వహించి ముందు రాజీనామా చేయాలి. తెలంగాణ ప్రభుత్వానికి భయమెంటో చూపిస్తాం. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. నిరుద్యోగులు అధైర్యపడొద్దు. టీఎస్‌పీఎస్సీలో అసలు దొంగలను అరెస్ట్ చేయాలి’ అని అన్నారు.

పరీక్ష రాసి నష్టపోయిన అభ్యర్థులందరికీ రూ. లక్షచొప్పున పరిహారం ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 30 లక్షల నిరుద్యోగుల భవిష్యత్ ను కేసీఆర్ ప్రభుత్వం అందకారం చేసిందన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు అండగా బీజేపీ ఉంటుందన్నారు. వచ్చేది రామరాజ్యమని.. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని తెలిపారు.