భారత్‌తో రక్షణ సంబంధాలు మాకెంతో కీలకం: కెనడా రక్షణ శాఖ మంత్రి

ఇండో పసిఫిక్ వ్యూహానికి ఇప్పటికీ ప్రాధాన్యం ఉందని స్పష్టీకరణ

‘Relationship with India important’: Canada’s Defence Minister amid diplomatic row

ఒట్టావా: భారత్‌తో రక్షణ సంబంధాలు తమకెంతో ముఖ్యమని కెనడా రక్షణ శాఖ మంత్రి బిల్ బ్లెయిర్ తాజాగా పేర్కొన్నారు. సిక్కు వేర్పాటువాది నిజ్జర్ హత్యపై దర్యాప్తు జరుగుతున్నా కూడా ఇతర అంశాల్లో రెండు దేశాల భాగస్వామ్యం కొనసాగడం కీలకమని తెలిపారు. ‘ది వెస్ట్ బ్లాక్’ అనే పత్రికకు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘మాకు ఇది (నిజ్జర్ హత్య) సమస్యాత్మకంగా మారింది. అయితే, మా దేశ భూభాగాన్ని, చట్టాలను, పౌరులను రక్షించుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ఈ ఆరోపణలు నిజాలుగా తేలితే అది కచ్చితంగా కెనడాకు ఓ ఆందోళనకారక అంశంగా మారుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఇండో పసిఫిక్ వ్యూహానికి కెనడా ఇప్పటికీ ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు నిజ్జర్ హత్య వెనకాల భారత సీక్రెట్ ఏజెంట్ల హస్తం ఉండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు ఇరు దేశాల మధ్య పెను వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.