బండి సంజయ్ అరెస్ట్ ఫై బిఆర్ఎస్ నేతల రియాక్షన్..

బండి సంజయ్ అరెస్ట్ ఫై బిఆర్ఎస్ నేతలు తమ స్పందనను తెలియజేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. పిచ్చోని చేతిలో రాయి ఉంటే ప్రమాదమంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. నీచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన బీజేపీ.. పేపర్ లీకేజీ కుట్రలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి అరెస్ట్.. అంటూ బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్ ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కలిసే టెన్త్ క్లాస్ పేపర్ లీక్ చేశారని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. హిందీ క్వశ్చన్ పేపర్ లీక్ కు.. బండి సంజయ్, ఈటల రాజేందర్ కి సంబంధం ఉందని వీళ్ల కనుసన్నల్లోనే పేపర్ లీక్ జరిగిందని కౌశిక్ రెడ్డి విమర్శించారు. బండి సంజయ్ బాధ్యత గల పదవిలో ఉండి.. పేపర్ లీక్ లు చేస్తూ పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి వాళ్లను చట్టం కఠినంగా శిక్షించాలని కోర్టును కోరారు.

పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీలో రాజకీయ నాయకుల పాత్ర ఉండటం దురదృష్టకరం అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తప్పు చేసి అడ్డంగా దొరికినా కూడా బీజేపీ నాయకులు బండిని సమర్థించడం సిగ్గు చేటు అన్నారు. పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లి మరీ దొంగను రక్షించే ప్రయత్నం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. పేపర్ లీకులతో రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు సృష్టిస్తోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ లో TSPSC పేపర్ లీక్ వ్యవహారం కొనసాగుతున్న తరుణంలోనే తాజాగా పదో తరగతి పేపర్స్ లీక్ అవుతుండడం తో సంచలనంగా మారింది. ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో బిజెపి నేతల హస్తం ఉందని బిఆర్ఎస్ ఆరోపిస్తుంది. అందులో భాగంగానే పోలీసులు బండి సంజయ్ ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అర్ధరాత్రి బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు ముందుగా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయం పది గంటల ప్రాంతంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మధ్య ఆయన్ను పాలకుర్తి ప్రభుత్వ హాస్పటల్ కు తీసుకొచ్చారు. అనంతరం ఆయన్ను డాక్టర్స్ పరీక్షలు చేసారు. ప్రస్తుతం సంజయ్ ని హన్మకొండ మేజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్తున్నారు.