డిపాజిటర్ల సొమ్ముకు మరింత రక్షణ

reserve bank of india
reserve bank of india

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ముకు మరింత ఎక్కువ రక్షణ లభించనుంది. బ్యాంకు డిపాజిట్లపై ఇప్పటి వరకు ఉన్న బీమా కవరేజీని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారంనాటి బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించడం తెలిసిందే. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలపడంతో ఫిబ్రవరి 4( మంగళవారం) నుంచే అమలులోకి తీసుకొచ్చినట్లు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా ఏదైనా కారణం చేత బ్యాంకు మూతపడితే అందులో డిపాజిట్లపై గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు బీమా కవరేజీ ఉంటుంది. ఆర్బీఐ అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) ఈ బీమా కవరేజీని అందిస్తుంది. డీఐసీజీసీలో బీమా పొందిన అన్ని బ్యాంకులకు ఇది వర్తిస్తుందని ఆర్బీఐ తెలిపింది.
1993 నుంచి బ్యాంకు డిపాజిట్లపై బీమా కవరేజీ రూ.1 లక్షగా కొనసాగుతోంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ బీమా కవరేజీని రూ.5 లక్షలకు పెంచారు. గత ఏడాది పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేజివ్ బ్యాంక్‌లో స్కామ్ జరగడంతో లక్షలాది మంది కస్టమర్లు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ తాజా నిర్ణయంతో బ్యాంకింగ్ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగే అవకాశముంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/