అయోధ్యలో రామమందిరంపై మోడి కీలక ప్రకటన

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ‘రామజన్మభూమి తీర్థ ట్రస్ట్‌’ ఏర్పాటు

PM-Announces-Trust-For-Construction-Of-Ram-Temple-In-Ayodhya

న్యూఢిల్ల్లీ: ప్రధాని నరేంద్రమోడి పార్లమెంట్‌లో అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కీలక ప్రకటన చేశారు రామజన్మభూమి తీర్థ ట్రస్ట్‌ను కేంద్రం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. మందిర నిర్మాణంపై ట్రస్ట్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని ప్రధాని మోడి ప్రకటించారు. అయితే బుధవారం ఉదయం జరిగిన కేబినెట్‌ సమావేశంలో అయోధ్య అంశంలో మేం ఓ కీలక నిర్ణయం తీసుకున్నాం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రామ మందిర నిర్మాణం కోసం ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాం అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ట్రస్ట్ గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ట్రస్ట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. రామమందిర ప్రాంతం కోసం 67 హెక్టార్ల భూమిని ట్రస్ట్‌కు అప్పగిస్తున్నామని ఆయన తెలిపారు. రామమందిరం నిర్మాణానికి అందరూ సహకరించాలని ప్రధాని నరేంద్రమోడి విజ్ఞప్తి చేశారు.

సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా 5 ఎకరాలు వక్ఫ్ బోర్డుకు ఇచ్చేందుకు యూపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని తెలిపారు. అయోధ్యలోని వివాదాస్పద భూమి రామజన్మస్థలమే అని గత నవంబర్‌లో ఇచ్చిన తుది తీర్పులో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు… అక్కడ మందిర నిర్మాణానికి వీలుగా మూడు నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుకు తగ్గట్టుగానే ట్రస్ట్‌పై కేంద్రం నిర్ణయం తీసుకోగా… ఇందుకు సంబంధించి పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోడి అధికారిక ప్రకటన చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/