రామోజీరావు కన్నుమూత

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు. రామోజీరావు మృతికి సినీ , రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. పారిశ్రామికవేత్తగా, పత్రికా సంపాదకుడిగా, స్టూడియో వ్యవస్థాపకునిగా, సినీ నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎన్నో రంగాల్లో రాణించారు. అన్నింటిలోకి జర్నలిజమే ఆయనకు అమితంగా ఇష్టమైనది. రోజులో ఎక్కువ సమయం దీనికే కేటాయిస్తారు. వర్తమాన వ్యవహారాల్ని ఆయన నిశితంగా పరిశీలిస్తారు. తెలుగు నుడి, పద ప్రయోగం, వాక్యనిర్మాణంపై ఆయనకు పట్టు ఎక్కువ. చెప్పాల్సిన విషయం అక్షరాల్లో నూరుశాతం ప్రతిబింబించేంత వరకు ఆయన పట్టు విడవరు. సంపాదకుడు అంటే ఆయనే. న్యూస్ ప్లానింగ్, న్యూస్ జడ్జిమెంట్ రామోజీరావు నుంచే నేర్చుకోవాలి. ఈనాడు ఇన్ని విజయ శిఖరాలు చేరడానికి తనలోని పాత్రికేయుడే ప్రధాన కారణం. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా కూడా రామోజీరావు పనిచేశారు.