చైనా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటి

లడఖ్ సరిహద్దులో తాజా ఉద్రిక్తతలపైనా చర్చించిన నేతలు

చైనా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటి
rajnath-singh-set-to-meet-chinese-defence-minister-in-moscow

మాస్కో: భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రష్యా పర్యటన కొనసాగుతుంది. ఈనేపథ్యంలోనే ఆయన శుక్రవారం రాత్రి చైనా రక్షణ మంత్రి వే ఫెంఝీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పలు కీలక అంశాలను చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే, లడఖ్ సరిహద్దులో నెలకొన్న తాజా ఉద్రిక్తతలపైనా వీరు చర్చించినట్టు సమాచారం. దాదాపు రెండున్నర గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. వాస్తవాధీన రేఖ వద్ద యథాతథస్థితిని కొనసాగించాలని రాజ్‌నాథ్ కోరారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో రక్షణ కార్యదర్శి అజయ్‌ కుమార్‌, రష్యాలో భారత రాయబారి వీబీ వెంకటేశ్‌ వర్మ కూడా పాల్గొన్నారు. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో భాగంగా శుక్రవారం జరిగిన వివిధ దేశాల రక్షణ మంత్రుల సమావేశం అనంతరం ఈ భేటీ జరిగింది. చైనా రక్షణ మంత్రి వీ ఫెంఘే విజ్ఞప్తి మేరకే రాజ్‌నాథ్‌ ఆయనతో సమావేశమైనట్టు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తూర్పు లఢక్‌ సరిహద్దుల్లో మే నెలలో తలెత్తిన ఉద్రిక్తతల తర్వాత భారత్‌చైనా రక్షణ మంత్రులు ముఖాముఖిగా భేటీ కావడం ఇదే తొలిసారి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/