అగ్నిపథ్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు – రాజ్​నాథ్​ సింగ్

అగ్నిప‌థ్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా గత కొద్దీ రోజులుగా ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. బీహార్ , యూపీ, రాజస్థాన్ , హర్యానా , వారణాసి వంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనలు చేస్తూ , ప్రభుత్వ ఆస్తులను నాశనం చేసారు. ఇక నిన్న శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు విధ్వసం సృష్టించారు. అయినప్పటికీ కేంద్రం అగ్నిప‌థ్ విషయంలో వెనక్కు తగ్గడం లేదు.

అగ్నిపథ్​ పథకంపై దేశవ్యాప్తంగా నిరసలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నేవీ, ఎయిర్​ఫోర్స్​ చీఫ్​తో పాటు ఆర్మీ వైస్​చీఫ్​తో రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ భేటీ అయ్యారు. ఈ పథకం అమలుపై సమీక్ష చేపట్టిన రాజ్​నాథ్​.. అగ్నిపథ్​ను మరోసారి సమర్థించారు. అగ్నివీరులకు శిక్షణ ఇచ్చే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజనాధ్ నివాసంలో నేవీ చీఫ్‌ అడ్మిరల్ ఆర్‌ హరి కుమార్​, వాయుసేనాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సైనిక విభాగాల అధికారులు కూడా పాల్గొన్నారు.

అగ్నిపథ్‌ను నిరసిస్తూ పలు రాష్ట్రాల్లో జరిగిన ఆందోళనలపై ఈ భేటీలో రాజ్‌నాథ్‌ చర్చించినట్లు అధికారిక వర్గాల సమాచారం. ఉద్రిక్తతలను తగ్గించేలా చేపట్టాల్సిన చర్యలపై కేంద్రమంత్రి చర్చించినట్లు తెలుస్తోంది.అగ్నిపథ్‌ పథకాన్ని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మరోసారి గట్టిగా సమర్థించారు. మాజీ సైనికుల సంఘంతో సహా పలువురు నిపుణులతో సుమారు రెండేళ్ల పాటు సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత.. ఈ పథకాన్ని ఏకాభిప్రాయంతో రూపొందించామని రక్షణ మంత్రి తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం అగ్నిపథ్‌పై.. అపోహలు వ్యాప్తి చేస్తున్నారని రాజ్‌నాథ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.