హరీష్ రావు ఫై దర్శక ధీరుడు ప్రశంసలు

టాలీవుడ్ అగ్ర దర్శకులు రాజమౌళి..మంత్రి హరీష్ రావు ఫై ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘లిటిల్‌ స్టార్స్‌ అండ్‌ షీ’ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను మంత్రి హరీశ్‌రావు, ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళితో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. హరీశ్‌రావును కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని , హరీశ్‌రావు పనితీరు తనకు నచ్చుతుందని తెలిపారు.

ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణ చాలా అభివృద్ధి చెందిందని, ఇందుకు సిద్దిపేట నియోజకవర్గ డెవలప్‌మెంటే నిదర్శనమని పేర్కొన్నారు. తాను షూటింగ్‌లో భాగంగా కొన్నేండ్ల కిత్రం వెళ్లిన సిద్దిపేటకు.. ఇటీవల వెళ్లిన సిద్దిపేటకు ఎంతో తేడా కనిపించిందని, హరీశ్‌రావు, తెలంగాణ సర్కారు పనితీరువల్లే ఇది సాధ్యమయ్యిందని రాజమౌళి అన్నారు.

అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ దర్శకుడు రాజమౌళిని కలువడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ‘ఆయన తెలుగుజాతి ఖ్యాతిని అంతర్జాతీయ వేదికల్లో వినిపించిన గొప్ప దర్శకుడు. బాహుబలి సినిమాతో తెలుగు ప్రజల ఖ్యాతిని జాతీయస్థాయిలో ఇనుమడింపజేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు ప్రజల ఖ్యాతిని నిలబెట్టారు. ఆయనకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. రాజమౌళి తండ్రిగారు చాలా సాదాసీదాగా ఉంటారని తెలిపారు.