కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అశాంతి రాజ్యమేలుతుందిః ప్ర‌ధాని మోడీ

PM Modi Reacts To Congress’ Decision To Ban Bajrang Dal In Poll Bound Karnataka

బెంగళూరుః కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బిజీ బిజీగా ఉన్నారు. వరుస ర్యాలీలు, రోడ్ షోలతో బిజెపికి తిరిగి అధికారం అప్పగించే దిశగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ బజరంగ్‌బలిపై అస్త్రాన్ని ప్రయోగిస్తామని మెనిఫెస్టోలో ప్రకటించగా.. ఆ పార్టీని టార్గెట్ చేస్తూ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. బజరంగ్‌దళ్‌ను బ్యాన్‌ చేస్తామన్న కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ప్రస్తావిస్తూ.. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అశాంతి రాజ్యమేలుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. టెర్రరిస్ట్‌ నేతలకు కాంగ్రెస్‌ ఆశ్రయం కల్పిస్తుందని ఈ సందర్భంగా ప్రధాని మోడీ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడి నుంచి పెట్టుబడిదారులు పారిపోతారని.. పెట్టుబడులు రావంటూ మోడీ వివరించారు. ఎన్నికల ప్రచారం చేసిన ప్రతిచోట మోడీ.. బజరంగ్‌ బలి నినాదంతో ముందుకెళ్తున్నారు.

కర్ణాటకలోని హోస్పేట్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ.. శ్రీరాముడితో కాంగ్రెస్ కు సమస్య రావడం దేశ దౌర్భాగ్యమని, ఇప్పుడు జై బజరంగ్ బలి అంటున్న వారితో ఇబ్బంది వచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అంతకుముందు శ్రీరామ్ నినాదాలు చేసేవారిని లాక్కెళ్లేవారని.. ఇప్పుడు జై బజరంగబలి అని నినాదాలు చేసేవారిని లాక్కెళ్లాలని నిర్ణయం తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బజరంగ్‌దళ్‌ను బ్యాన్‌ చేస్తామన్న కాంగ్రెస్‌ ఎన్నికల హామీని నిరసిస్తే రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు బిజెపి నేతలు. కర్ణాటకలో రేపు సాయంత్రం అన్ని ఆలయాల్లో హనుమాన్‌ చాలీసాను పఠించాలని బిజెపి నేతలు నిర్ణయించారు. కాగా, కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. 13న ఫలితాలు వెలువడనున్నాయి.