అసదుద్దీన్‌ ఓవైసీ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్‌లో శ్రీరామనవమి రోజున గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించిన శోభాయాత్రలో మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే ఫొటో దర్శనం ఇవ్వడం కలకలం రేపుతోంది. హనుమాన్‌ శోభాయాత్రలో గాడ్సే ఫోటోను ఎలా ప్రదర్శిస్తారని.. దేశంలో తొలి టెర్రరిస్టు నాథురామ్‌ గాడ్సేనేనని.. ఆయన ఫోటోలు ప్రదర్శిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ప్రశ్నించారు. తాము లాడెన్‌, హజరీ ఫోటోలు ప్రదర్శిస్తే ఊరుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఘాటుగా స్పందించారు. తొలి టెర్రరిస్ట్‌ నాథూరామ్ గాడ్సే కాదని.. తెలంగాణలో దమనకాండ సాగించిన ఖాసీం రజ్వీ అన్నారు. శోభాయాత్రలో శివాజీ, వీర సావర్కర్‌ల ఫోటోలు ఓవైసీకి కనబడలేదా అని ప్రశ్నించారు రాజాసింగ్‌. ఫోటోతో మొదలైన లొల్లి రజ్వీని సీన్‌లోకి లాగింది. ఈ వివాదానికి ఇంతటితో ఫుల్‌స్టాప్ పడుతుందా? మరోవైపు టర్న్‌ తీసుకుని రచ్చ చేస్తుందా అన్న చర్చ హీట్ పుట్టిస్తోంది.