తెలంగాణ లో నేడు, రేపు వర్షాలు..

తెలంగాణ లో నేడు , రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు నల్గొండ, ఖమ్మం మినహా మిగతా జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయని పేర్కొంది. హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపింది.

అలాగే వాతావరణంలో ఏర్పడిన మార్పులు కారణంగా మామిడి సాగుకు తిప్పలు తప్పవని వ్యవసాయ నిపుణులు చెపుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది వాతావరణ మార్పుల వలన మామిడి తోటలను చీడపీడలు ఆశించాయి. దీంతో ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం మామిడికి నల్ల నల్లి, ఎర్ర నల్లి, తేనెమంచు పురుగు, తెల్ల దోమ, పచ్చ దోమ ఆశించాయి. ఫలితంగా పూత పిందెగా మారడం లేదు. తెగుళ్ల కారణంగా ఎదుగుదల లేకపోవడమేకాక పూతతో పాటు పిందెలు రాలుతున్నాయి. దిగుబడిపై ఆశలు పెట్టుకున్న రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒక్క ఖమ్మం లోనే కాదు తెలంగాణ లోని పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.