ఏపీలో రేపు గ్రూప్-2 పరీక్ష..అన్ని ఏర్పాట్లు పూర్తి

రేపు ఏపీ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 పరీక్ష జరగనుంది. ఇందుకోసం 1,327 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉ.10.30 గంటల నుంచి మ. 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. ఉ.9.30 గంటలకల్లా అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలని, హాల్ టికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించమని, పరీక్ష సమయం ముగిసిన తర్వాతే బయటకు పంపిస్తామని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటె .. ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఇదివరకు కాలేజీ ఫీజుల కోసం హాల్ టికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు వేధించేవి. తాజా నిర్ణయంతో విద్యార్థులే నేరుగా సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ ఫై ఫొటో ప్రింట్ కాకపోతే పాస్ ఫోటో సైజ్ ఫొటోతో కాలేజీలను సంప్రదిస్తే.. స్కాన్ చేసి ఫొటోతో కూడిన హాల్ టికెట్ ఇస్తారని పేర్కొంది.

అలాగే టెట్ దరఖాస్తులు లపై కూడా విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న బీఈడీ అభ్యర్థులకు పరీక్ష ఫీజును రీఫండ్ చేయనున్నట్లు పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. వారు ఎస్జీటీ పోస్టులకు అనర్హులని హైకోర్టు ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల ఆధార్ కు లింకై ఉన్న బ్యాంక్ ఖాతాల్లో రీఫండ్ నగదును జమ చేస్తామని తెలిపింది. టెట్ కు 2,67,559 దరఖాస్తులు వచ్చాయని, హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.