హైదరాబాద్ లో మరోసారి ఉరుములతో కూడిన వర్షం

భాగ్యనగరం హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం పడింది. శుక్రవారం ఉదయం నుండి ఉరుములు , మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో ఆఫీస్ లకు వెళ్లే వారు , రోజు వారి పనులు చేసుకునే వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, నాంపల్లి, చందానగర్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్‌, నిజాంపేట్‌, జగద్గిరిగుట్ట, జేఎన్‌టీయూ, ప్రగతినగర్‌, మూసాపేట్‌, కుత్బుల్లాపూర్‌, సూరారం, జీడిమెట్ల, చింతల్‌, బాలానగర్‌, కొంపల్లి, సుచిత్ర, బోయిన్‌పల్లి, సికింద్రాబాద్‌, మాదాపూర్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తున్నది. అయితే జీహెచ్‌ఎంసీ సిబ్బంది రోడ్లపై నీళ్లు నిలువకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చిన నీటిని వచ్చినట్లే వెళ్లిపోయేలా చూస్తున్నారు.

ఇక గురువారం సాయంత్రం కూడా హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ రాజేంద్రనగర్ జోన్ డీసీపీ కార్యాలయం ప్రాంగణంలో పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు కాలిపోయింది. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీశారు. భయంతో కొందరు పరుగులు తీశారు. గత కొద్దీ రోజులుగా మార్నింగ్ 8 గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం వరకు తీవ్రమవుతున్నాయి. ఎండలు ఎక్కువవడంతో జనం కూడా బయటకు వెళ్లాలంటే ఆలోచిస్తున్నారు. సాయంత్రం కాగానే బయటకు వెళ్దామనుకునే సరికి వర్షాలు పడుతున్నాయి. ఈ అకాల వర్షాలు జనాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.