భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం – పవన్ కళ్యాణ్

ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంబేద్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘ నేను.. నా దేశం.. ఈ రెండింటిలో నా దేశమే గొప్పది’ అని అంబేద్కర్ చెప్పారని… ఇంతకంటే గొప్పగా ఎవరు చెప్పగలరని అన్నారు. రాజ్యాంగమనే మహా సూత్రాలను భరత జాతికి అంబేద్కర్ అందించారని కొనియాడారు. మన దేశం, మన ప్రజలు సమైక్యంగా, సమున్నతంగా, శక్తిమంతంగా, సమభావంగా ముందుకు సాగడానికి రాజ్యాంగం ద్వారా పద నిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. అంబేద్కర్ లాంటి మహా జ్ఞానులు కోటి మందికి ఒక్కరే ఉంటారని చెప్పారు.

మేకలను బలి ఇస్తారని, పులులను బలి ఇవ్వరని… అందుకే అందరూ పులుల్లా బతకాలని చెపుతూ అణగారిన వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని అంబేద్కర్ పెంచారని పవన్ తెలిపారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి జీవిత చరమాంకం వరకు అవిరళ కృషి చేశారని చెప్పారు. అంబేద్కర్ కు ఘన నివాళి అర్పిస్తున్నాని అన్నారు.

ఇదిలా ఉంటె హైదరాబాద్ లో దేశంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాన్ని ఈరోజు మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఆవిష్కరించబోతున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున.. హుస్సేన్ సాగర్ తీరాన ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. 2016 ఏప్రిల్ 14న అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగులు భారీ విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీఎం ప్రకటన మేరకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విగ్రహ నిర్మాణం చేపట్టింది.