ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన

Rain forecast for Telangana for five days

అమరావతిః తెలంగాణలో తీవ్ర ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తను హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది. వచ్చే ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని పేర్కొంది. అలాగే మరికొన్ని జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు వచ్చే ఐదు రోజులపాటు ఉండే వాతావరణ పరిస్థితులపై శుక్రవారం బులెటిన్ విడుదల చేసింది.

వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడా వడగాడ్పులు వీచే అవకాశం. రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ వరకు పెరగొచ్చు.

నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో శనివారం అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవొచ్చు.

ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ , నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడొచ్చు. మిగతా రెండు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.