భారీ వర్షాల వల్ల మిషన్ భగీరథ నీళ్ల సరఫరాకు ఆటంకం

గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడం తో మిషన్ భగీరథ నీళ్ల సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, నల్లగొండ, నిర్మల్ జిల్లాల్లో 2,222 గ్రామాల్లో మిషన్ భగీరథ మంచినీటి సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో నీటికి ఇబ్బంది పడకుండా వెంటనే నీటిని సరఫరా చేయాలనీ ఆదేశించారు. బుధువారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, తదితర అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షించారు. వరద నీటితో రోడ్లు కోతకు గురవుతున్న నేపథ్యంలో.. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే కోతకు గురైన రోడ్ల వివరాలు, నష్టం అంచనా వివరాలను సేకరించి, వాటి పునరుద్ధరణ చర్యలకు ఉపక్రమించాలని సూచించారు. పంచాయతీ రాజ్ రోడ్ల సమస్యల పరిష్కారం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా అందుబాటులోకి తీసుకోస్తామన్నారు.
మరోపక్క వర్షాలు, వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో ప్రగతి భవన్‌లో సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజా ప్రతినిధులను సీఎం అప్రమత్తం చేశారు. తక్షణ రక్షణ చర్యలను కొనసాగిస్తూ.. వరదలవల్ల కలిగే ఆస్తి, ప్రాణ నష్టాలను వీలయినంతమేర తగ్గించాలని సీఎం సూచించారు. ఎగువన కురుస్తున్న భారీ వానల నేపథ్యంలో అటు కృష్ణా, ఇటు గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి నది హెచ్చరికలు దాటి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఎస్సారెస్పీ వంటి పలు రిజర్వాయర్లకు సంబంధించిన ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోల గురించి సీఎం ఆరా తీశారు.