హైదరాబాద్ కు వర్షసూచన

హైదరాబాద్ వాసులకు చల్లటి వార్త. గత కొద్దీ రోజులుగా విపరీతమైన ఎండ తో ఇబ్బంది పడుతున్న నగర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించారు. ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు నగరంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరోపక్క కిందిస్థాయి గాలులు వాయువ్య, పశ్చిమ దిశల నుంచి తెలంగాణ వైపునకు వీస్తుండడంతో గ్రేటర్‌లో ఎండలు దంచి కొడుతున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అధికంగా ఉండగా సాయంత్రానికి ఒక్కసారిగా నగర వాతావరణం చల్లబడుతుందని తెలిపారు.

అలాగే ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది.

రేపు (జూన్ 10) సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులంబ గద్వాల్ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. ఇక నేడు, రేపు పలు జిల్లాల్లో వడగాల్పులు కూడా వీయనున్నాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.