దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుంది – రాహుల్ ఆరోపణ

దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుందని ఆరోపించారు రాహుల్ గాంధీ. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తెలంగాణ లోని నిర్మల్ పర్యటించారు. జన జాతర సభ లో సీఎం రేవంత్ పాటు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..బిజెపి ఫై పలు ఆరోపణలు , విమర్శలు చేసారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని , రాజ్యాంగాన్ని మార్చడం అంటే రిజర్వేషన్లను ఎత్తివేయడమేనని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడే కాంగ్రెస్ కావాలో.. రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకుంటున్న బీజేపీ-ఆర్ఎస్ఎస్ కావాలో నిర్ణయించుకోవాలని ప్రజలకు సూచించారు. ఉచిత పథకాలు అమలు చేస్తే సోమరిపోతులుగా తయారు చేస్తున్నారని అంటున్నారని రాహుల్ విమర్శించారు.

తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తున్నామని రాహుల్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదల జాబితా తయారు చేసి.. ప్రతి కుటుంబానికి ఏడాదికి లక్ష రూపాయలు వేస్తామని చెప్పారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీరుస్తాం. గ్రాడ్యుయేట్స్ కు ఏడాది గ్యారెంటీ స్కీం అమలు చేస్తాం. ఏడాది వరకు ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో ఉధ్యోగాలు కల్పిస్తాం. ఏడాది తరువాత ఆ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని రాహుల్ చెప్పారు. 30లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఆదివాసీలకు జల్ జమీన్ జంగల్ పై హక్కులు కల్పిస్తామని రాహుల్ అన్నారు.

బీజేపీ పేదల హక్కులను హరించి.. ధనికులకు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. తాము ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తామంటే తప్పుపడుతున్నారని.. మరి బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ పెద్దలకు రుణాలు ఎందుకు మాఫీ చేసిందని నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన మిత్రుల కోసం రూ. 16 లక్షల కోట్ల నిధులను మాఫీ చేశారంటూ రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. 16 లక్షల కోట్లతో 25 కోట్ల మందికి ఉపాధి కల్పించవచ్చని రాహుల్ గాంధీ వివరించారు.