ఏపీలో రాహుల్ పాదయాత్ర..?

భారత్ జోడో యాత్ర తో దేశమంతా నడిచిన రాహుల్..ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తెచ్చేందుకు చూస్తున్నాడు. ఇప్పటికే తెలంగాణ లో అనేక మార్పులు , పలువురికి కీలక పదవులు అప్పగించి ..మళ్లీ కార్యకర్తల్లో జోష్ నింపారు. మొన్నటి వరకు ఓ లెక్క..ఇప్పటి నుండి ఓ లెక్క అన్నట్లు తెలంగాణ లో కాంగ్రెస్ దూకుడు చూపిస్తుంది. అధికార పార్టీ నుండే కాక ఇతర పార్టీ నేతలు సైతం పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరుతూ..బలం పెంచుతున్నారు.

ఇదే క్రమంలో ఏపీలోనూ కాంగ్రెస్ ను పూర్వ వైభవం తీసుకరావాలని అక్కడి నేతలు రాహుల్ ను కోరుతున్నారట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేకుండా విజయపధంలో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రాన్ని సంక్షేమంతో నింపేశారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు రాష్ట్ర విభజన అంతా ఒక కలలా జరిగిపోయాయి. ఇప్పుడు తెలంగాణాలో పర్వాలేదు,. కానీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నుండి నిలబడే అభ్యర్ధే లేకుండాపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వచ్చే ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను పోటీలో నిలపడానికి ఒక మహత్తర ప్లాన్ ను అమలుచేయడానికి రంగం సిద్ధమవుతోంది. తిరుపతి మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ ఇటీవల రాహుల్ గాంధీని ఏపీలో పాదయాత్రను చేయాలని అడిగారట. ఇందుకు రాహుల్ గాంధీ కూడా సుముఖంగా సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది.

మరి నిజంగానే రాహుల్ ఏపీలో పాదయాత్ర చేస్తారా..? చేస్తే ఈ రెండు మూడు నెలల్లోనే చేయాల్సి ఉంది. ఎందుకంటే మరో ఐదు , ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో రాహుల్ పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ కు కాస్త ఊరట లభిస్తుంది.