పార్టీలో స్వార్థపరులే నన్ను లక్ష్యంగా చేసుకున్నారు: గులాం నబీ ఆజాద్

జమ్మూ కశ్మీర్లో కొత్త పార్టీ ప్రారంభిస్తానని ప్రకటన

Modi an excuse, Congress had issue with me since G23 letter was written: Ghulam Nabi Azad

న్యూఢిల్లీ: గులాం నబీ ఆజాద్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ..జీ-23 నేతల్లో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసినప్పటి నుంచే పార్టీకి తనతో సమస్య ఉందని అన్నారు. తన రాజీనామాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సాకుగా చూపుతున్నారన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి తాను బలవంతంగా బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. 30 ఏళ్ల క్రితం సోనియా గాంధీకి ఎలాంటి గౌర‌వం ఇచ్చామో ఇప్పుడూ అంతే మ‌ర్యాద ఉంద‌న్నారు. రాహుల్ గాంధీకి కూడా గౌర‌వం ఇస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇందిరా గాంధీ ఫ్యామిలీ, రాజీవ్‌-సోనియా కుమారుడి ప‌ట్ల త‌న‌కు ద్వేష భావం లేద‌న్నారు. వ్య‌క్తిగ‌తంగా రాహుల్ సుదీర్ఘ జీవితం కోసం ప్రార్ధిస్తున్న‌ట్లు ఆజాద్ తెలిపారు. రాహుల్ గాంధీని స‌క్సెస్‌ఫుల్ నేత‌గా మార్చేందుకు ప్ర‌య‌త్నించామ‌ని, కానీ ఆయ‌న‌కు ఎటువంటి ఆస‌క్తి లేద‌ని గులాం న‌బీ ఆజాద్ అన్నారు.

‘జీ-23లో పాత్ర తర్వాత నన్ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్‌లోని కొందరు స్వార్థపరులు మాత్రమే నన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎందుకంటే తమకు ఎవ్వరూ లేఖలు రాయకూడదని, తమను ఎవ్వరూ ప్రశ్నించకూడదని వారు అనుకున్నారు. పార్టీలో అనేక సమావేశాలు జరిగాయి, కానీ వాళ్లు ఒక్క సూచన కూడా తీసుకోలేదు’ అని ఆజాద్ పేర్కొన్నారు. కపిల్ సిబల్, జితిన్ ప్రసాద, యోగానంద్ శాస్త్రి తర్వాత పార్టీ నుంచి వైదొలిగిన జీ-23 గ్రూపులో గులాం నబీ ఆజాద్ నాలుగో నాయకుడు. ఇక, పార్లమెంట్‌లో ప్రధాని మోడీని రాహుల్ గాంధీ కౌగిలించుకోవడంపై గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. ‘మోడీకి చిక్కింది నేను కాదు, ఆయనే’ అని ఎద్దేవా చేశారు. ఆగస్ట్ 26న పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ సెప్టెంబర్ 4న జమ్మూ చేరుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న జమ్మూ కాశ్మీర్‌లో కొత్త పార్టీని ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/