కడపలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సిఎం జగన్‌

ap-cm-jagan-inaugurates-many-development-works-in-kadapa-district

కడపః సిఎం జగన్‌ కడప జిల్లాలో మూడో రోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సిఎం అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. మొత్తం 872 కోట్ల రూపాయల విలువైన పనులకు ఆయన కడపలో శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా కడప పట్టణంలో రూ.1.37 కోట్లతో పూర్తయిన రాజీవ్‌ పార్కు అభివృద్ధి పనులను, రూ. 5.61 కోట్లతో పూర్తయిన రాజీవ్‌ మార్గ్‌ అభివృద్ధి పనులను సీఎం జగన్‌ ప్రారంభించారు. అలాగే కడప కొప్పర్తి పారిశ్రామికవాడలో ఏర్పాటు చేసిన ఆల్‌డిక్సాన్‌‌ యూనిట్‌ను జగన్‌ ప్రారంభించారు. సుమారు రూ.150 కోట్లతో ఈ యూనిట్‌ను ఏర్పాటుచేశారు. అలాగే పుట్లంపల్లి చెరువు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆపై అనేక పారిశ్రామిక సంస్థల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమాల అనంతరం నేరుగా కడప విమానాశ్రయానికి చేరుకుని గన్నవరం చేరుకుంటారు. అనంతరం తాడేపల్లి లోని తన నివాసానికి బయలు దేరుతారు.

అంతకు ముందు కడపకు చేరుకున్న సీఎంకు పలువురు మంత్రులు, అధికారులు, వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులు సాదర స్వాగతం పలికారు. అంజాద్ భాషా, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మేయర్ సురేష్ బాబు, జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి సీఎంకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.