రేపు కూడా రావాలంటూ రాహుల్ కు ఈడీ సూచన

నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ ను ఈడీ అధికారులు విచారిస్తూనే ఉన్నారు. నాలుగో రోజైన సోమవారం రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది. గత నాలుగు రోజుల్లో దాదాపు 40 గంటల పాటు ఆయనను ఈడీ ప్రశ్నించింది. ఇక రేపు మంగళవారం (జూన్ 21న) కూడా విచారణకు హాజరుకావాలని రాహుల్ కు ఈడీ సూచించింది. జూన్ 17న ఈడీ విచారణకు హాజరైన రాహుల్.. రెండ్రోజులు విరామం ఇవ్వాలని అధికారులను కోరారు. తన తల్లి సోనియా గాంధీ అస్వస్థతకు గురైన నేపథ్యంలో విరామం కోరారు రాహుల్. ఈ నేపథ్యంలో రాహుల్​ను సోమవారం రావాలని ఈడీ పేర్కొంది. ఈ ప్రకారం.. సోమవారం ఉదయం 11.05 గంటలకు ఏపీజే అబ్దుల్ కలాం రోడ్​లో ఉన్న ప్రధాన కార్యాలయానికి రాహుల్ వెళ్లారు.

గతవారం తరహాలోనే ఈడీ ఆఫీస్ పరిసరాల్లో అధికారులు 144 సెక్షన్ విధించారు. భారీ సంఖ్యలో పోలీసులను, పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు. మధ్యాహ్నం 3.45 గంటలకు భోజన విరామం తీసుకున్న రాహుల్.. 4.45 గంటలకు మళ్లీ ఈడీ ఆఫీస్​కు వెళ్లారు. ఇదిలా ఉండగా.. నేషనల్ హెరాల్డ్ కేసులోనే విచారణకు హాజరు కావాలని సమన్లు అందుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.

కోవిడ్ నుంచి కోలుకున్న సోనియా ఇతర అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందారని జైరాం రమేశ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. డిశ్చార్జ్ అయినప్పటికీ ఇంట్లోనే మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సోనియాకు సూచించినట్లు ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను కాంగ్రెస్ ఎంపీల బృందం సోమవారం కలుసుకుంది. రెండు అంశాలపై రాష్ట్రపతికి లేఖలు ఇచ్చామని ఆ బృందంలోని కీలక నేత మల్లికార్జున ఖర్గే రాష్ట్రపతితో భేటీ అనంతరం మీడియాకు తెలిపారు. రాహుల్ గాంధీని రేపు కూడా ఈడీ విచారణకు పిలిచిన నేపథ్యంలో ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ కానున్నారు. ఈ భేటీకి రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రులు కూడా హాజరుకావాలని సమాచారం పంపారు.