అనర్హత వేటుపై స్పందించిన రాహుల్ గాంధీ

అనర్హత వేటుపై రాహుల్ గాంధీ స్పందించారు. తాను దేశపు స్వరాన్ని వినిపించేందుకు పోరాడుతున్నానని.. అందుకోసం ఎంత వరకు వెళ్లేందుకైనా సిద్ధం అంటూ ట్విట్టర్ వేదికగా.. తన స్పందన తెలియజేశారు. రాహుల్ ఈ సందేశాన్ని హిందీలో రాసుకొచ్చారు.

రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఈ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రధాని మోడీ ఇంటిపేరు వ్యవహారంలో ఆయనను సూరత్ న్యాయస్థానం దోషిగా తేల్చిన నేపథ్యంలో లోక్ సభ ఈ నిర్ణయం తీసుకుంది. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో ఆయన కర్ణాటకలోని కోలార్ లో రోడ్ షో, భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఆ సమయంలో మోడీ ఇంటిపేరును ప్రస్తావించారు. వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసగించి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల పేర్లన్నీ మోడీ ఇంటిపేరుతోనే ఎందుకు ఉంటోన్నాయని ప్రస్తావించారు. రాహుల్ గాంధీపై నేరారోపణ రుజువు కావడంతో ఆయనపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్ ఊపందుకుంది. బిజెపి కి చెందిన ఎంపీలందరూ ఈ డిమాండ్ లేవనెత్తుతూ వచ్చారు. ఈ క్రమంలో లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి సర్క్యులర్ జారీ అయింది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత పడింది.

ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. దేశ ప్రజాస్వామ్యానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు గొడ్డలి పెట్టులాంటిదేనని కాంగ్రెస్ నేతలు అభివర్ణిస్తున్నారు. మోదీ ప్రభుత్వ కక్షపూరితంగానే.. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిందని ఆరోపిస్తున్నారు.