రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడటంపై కాంగ్రెస్ నేతల రియాక్షన్

ప్రధాని మోడీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ వ్యాఖ్యానించి రెండేళ్ల జైలుశిక్ష పొందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు లోక్‌ సభ జనరల్‌ సెక్రటరీ నోటిఫికేషన్‌ ను రిలీజ్‌ చేశారు. దీనిపట్ల కాంగ్రెస్ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు సైతం బిజెపి తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ లు ఖండించడం జరిగింది. ఇది ప్రధాని మోడీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని అన్నారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటి రోజుగా కేసీఆర్ అభివర్ణించారు.

తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తీవ్ర స్థాయిలో స్పందించారు. కక్ష సాధింపులతో దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని సీతక్క ఆరోపించారు. మోదీ ప్రభుత్వ దోపిడీని, వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని స్పష్టం చేశారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నది ఎంత వాస్తవమో.. ఈ దేశం కోసం, దేశ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీ గొంతు నొక్కి ఆయన్ను ఆపాలేరన్నది కూడా అంతే వాస్తవమన్నారు. ఇలాంటి కేసులు, బెదిరింపులకే కాదు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన కుటుంబం వాళ్లదని సీతక్క గుర్తు చేశారు. అలాగే రాహుల్ సోద‌రి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సైతం ట్విట్టర్ వేదికగా మోడీ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రధాని మోడీ తానేం చేయ‌ద‌లుచుకుంటే అది చేయ‌వ‌చ్చ‌ని కానీ త‌మ కుటుంబం ఆయ‌న ముందు త‌ల‌వంచ‌బోద‌ని స్ప‌ష్టం చేశారు. మా న‌రాల్లో ప్ర‌వ‌హించే ర‌క్తం ఎలాంటిదంటే.. మీలాంటి పిరికి, అధికార దాహం క‌లిగిన నియంత ముందు తాము త‌ల‌వంచ‌మ‌ని మోడీని ఉద్దేశించి ఆమె పేర్కొన్నారు.

అలాగే బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ సైతం ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశారు. ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని కొత్త ఇండియా ఇలా ఉంద‌న్నారు. విప‌క్ష నేత‌లే బీజేపీ టార్గెట్ అయిన‌ట్లు ఆమె విమ‌ర్శించారు. నేర చ‌రిత్ర ఉన్న బీజేపీ నేత‌లను క్యాబినెట్‌లోకి తీసుకుంటున్నార‌ని, ఇక విప‌క్ష నేత‌లపై అన‌ర్హ‌త వేటు వేస్తున్నార‌ని ఆమె అన్నారు. రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన ప్ర‌జాస్వామ్యంలో ఇప్పుడు మ‌రింత దిగ‌జారిన‌ట్లు ఆమె ఆరోపించారు.