రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని ఖండించిన సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్

రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని బిఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ ఖండించారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఈ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రధాని మోడీ ఇంటిపేరు వ్యవహారంలో ఆయనను సూరత్ న్యాయస్థానం దోషిగా తేల్చిన నేపథ్యంలో లోక్ సభ ఈ నిర్ణయం తీసుకుంది. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో ఆయన కర్ణాటకలోని కోలార్ లో రోడ్ షో, భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఆ సమయంలో మోడీ ఇంటిపేరును ప్రస్తావించారు. వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసగించి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల పేర్లన్నీ మోడీ ఇంటిపేరుతోనే ఎందుకు ఉంటోన్నాయని ప్రస్తావించారు. రాహుల్ గాంధీపై నేరారోపణ రుజువు కావడంతో ఆయనపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్ ఊపందుకుంది. బిజెపి కి చెందిన ఎంపీలందరూ ఈ డిమాండ్ లేవనెత్తుతూ వచ్చారు. ఈ క్రమంలో లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి సర్క్యులర్ జారీ అయింది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత పడింది.

రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని బిఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ ఖండించారు. ఇది ప్రధాని మోడీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని అన్నారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటి రోజుగా కేసీఆర్ అభివర్ణించారు. మోడీ పాలన ఎమర్జెన్సీని మించిపోతుందని విమర్శించారు. ప్రతిపక్ష నేతలను వేధించడం పరిపాటిగా మారిందన్నారు . నేరస్థులు, దగాకోరుల కొసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోడీ తన పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారని విమర్శించారు. పార్టీల మధ్య వైరుధ్యాలకు ఇది సందర్భం కాదన్న కేసీఆర్… దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి అని కేసీఆర్ పేర్కొన్నారు.

అలాగే మంత్రి కేటీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా ఖండించారు. ఆయనపై అనర్హత వేటు వేయడం రాజ్యాంగాన్ని దుర్వినియోగపరచడమేనని ఆరోపించారు. అత్యంత అప్రజాస్వామిక పద్దతిలో రాహుల్ పై వేటు వేశారని కేటీఆర్ అన్నారు. ఇది తొందరపాటు చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా ఫ్రెంచ్ తత్తవేత్త వాల్ టేర్, జర్మన్ థియాలజిస్ట్ మార్టిన్ నిమాలర్ కోట్స్ ను మంత్రి కేటీఆర్ జత చేశారు. రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ సపోర్టు చేస్తూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.