ఇళ్ల నుండి బయటకు రావొద్దంటూ రాష్ట్ర ప్రజలకు సూచించిన హిమాచల్ సీఎం

హిమాచల్ ప్రదేశ్ లో రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. ఈ భారీ వర్షాలకు పలు నదులు , కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వరదల కారణంగా వందలాది ఇల్లు కొట్టుకపోగా, పలు నేలమట్టం అయ్యాయి. ఈ క్రమంలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండడం తో ఇళ్ల నుండి బయటకు రావొద్దంటూ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సుఖ్ విందర్ సింగ్ సుఖు విజ్ఞప్తి చేశారు. కుండపోత వర్షాలు కురుస్తున్నదున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. తాను సహాయం చేయడానికి 24 గంటలూ అందుబాటులో ఉంటానని, ప్రజలు ఈ విపత్తు సమయంలో హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ కాల్ చేయాలని సీఎం కోరారు. శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో క్యాంపులు వేసి ప్రజలకు సహాయం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ‘‘దయచేసి ఈ విపత్తు సమయంలో ప్రజలకు సహాయం చేయండి, వారి నష్టాలకు పరిహారం అందేలా చూడండి’’ అని సీఏం సుఖు కోరారు.

ఉత్తరాదిని భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు కుదిపేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు చుట్టుపక్కన ఉన్న పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆకస్మిక వరదలు కూడా వచ్చేస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు దాదాపు 20 మంది పౌరులు మృత్యువాత పడ్డారు. అంతే కాదు స్వయంగా దేశ రాజధానికే యమునా నది ముప్పు పొంచి ఉంది. దీంతో కేంద్రం ఆయా రాష్ట్రాల్ని ఆదుకునేందుకు చర్యల్ని ముమ్మరం చేసింది. రానున్న రోజుల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. కొన్ని జిల్లాలో ఇప్పటికే రెడ్​ అలర్ట్​ జారీ అయింది. కంగ్రా, చాంబా, హిమపూర్, కుళ్లు, మండి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సోలన్, సిమ్లా, సిర్మార్‌, సిర్మౌర్‌లలో ఆరెంజ్ అలెర్ట్.. లాహౌల్ స్పితి జిల్లాలో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.