దావోస్ లో సీఎం రేవంత్ కి ఘన స్వాగతం..

తెలంగాణ సీఎం గా బాధ్యత చేపట్టిన రేవంత్ రెడ్డి మొదటిసారి విదేశీ పర్యటన లో బిజీ గా గడుపుతున్నారు. తెలంగాణ లో పదేళ్ల తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే పనిలో పడింది. ఇప్పటికే ఎన్నికల హామీలను నెరవేర్చే పని చేపట్టిన రేవంత్..తాజాగా రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు మొదలుపెట్టారు సీఎం. ప్రస్తుతం దావాస్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు లో సీఎం రేవంత్ తో పాటు పరిశ్రమల శాఖామంత్రి శ్రీధర్ బాబు పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి స్విట్జర్లాండ్‌లోని పలువురు ప్రవాస భారతీయ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం ఇచ్చి.. శాలువా కప్పి సన్మానించారు.

ఈ నెల 18వ తేదీ వరకు దావోస్ నగరంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు జరుగనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం మణిపూర్ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తిరిగి ఢిల్లీ చేరుకుని, అర్థరాత్రి 2 గంటలకు స్విస్ ఎయిర్ లైన్స్ విమానంలో స్విట్జర్లాండ్‌కు బయలుదేరి వెళ్లారు.

సీఎం హోదాలో తొలిసారి దావోస్ నగరంలో అడుగుపెట్టిన రేవంత్ రెడ్డికి ప్రత్యేక గౌరవం దక్కిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో ఆయన మాట్లాడుతారని తెలిపారు. ఇప్పటికే పలు కంపెనీ ప్రతినిధులను రేవంత్ రెడ్డి కలిశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న ప్రతికూల పరిస్థితులపై వివరించారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం వివరాలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం చీఫ్‌కు తెలిపారు. తమ ప్రభుత్వం పెట్టబడిదారులకు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తుందని రేవంత్ రెడ్డి వివరించారు.

ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్ అనే అంశంపై జరిగే అత్యున్నతస్థాయి సదస్సులో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రైతుల జీవనోపాధిని పరిరక్షించేందుకు వాతావరణానికి అనుగుణంగా సాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించే అంశంపై ప్రసంగిస్తారన్నారు. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేసిన ‘డెవలపింగ్ స్కిల్ ఫర్ ఏఐ’లో మాట్లాడనున్నారు. టెక్ కంపెనీలతో పాటు ప్రవాస భారత పారిశ్రామికవేత్తలను సీఎం కలుస్తారని తెలిపారు.